స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తన అమెరికా పర్యటనలో భాగంగా డాలస్ నగరానికి సమీపంలోని ఇర్వింగ్లో కొలువుదీరిన మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలోని ఫ్రిస్కో నగరంలో ఇటీవల నూతనంగా ఎస్బీఐ శాఖను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన అక్కడ పర్యటిస్తున్నారు.
కమిటీ సభ్యులకు అభినందనలు..
అగ్రరాజ్యమైన అమెరికాలోనే మహాత్ముడికి అతిపెద్ద స్మారక స్థలిని నిర్మించి, ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కమిటీ సభ్యుల కృషిని ఎస్బీఐ ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మాగాంధీ స్మారక స్థలి కమిటీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర, వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వలతో పాటు ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు మహేంద్ర రావు , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
