సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘శ్రీనివాస మంగాపురం’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే..
పెద్దిరెడ్డి(శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన కుటుంబం వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అయినా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా వదిలిపెట్టడు. అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతికి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులో ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్‌కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడంటే సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే ‘శ్రీనివాసమంగాపురం’ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ భూపతి బలమైన కథతోనే ఘట్టమనేని వారసుడిని లాంచ్ చేస్తాడనుకుంటే, రొటీన్ కమర్షియల్ స్టోరీతో జై కృష్ణని పరిచయం చేశాడు. స్టార్ హీరోల వారసుల ఎంట్రీ ఇలాంటి చిత్రాలతోనే ఉండటం మామూలే అయినప్పటికీ, ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్‌సెట్ మారి వైవిధ్యమైన కథలను కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో ఈ కథకు ఓకే చెప్పడం సాహసమే. దర్శకుడు అజయ్ భూపతి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు. లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు.
నటీనటుల పనితీరు..
తొలి సినిమానే అయినా జై కృష్ణ చక్కగా నటించాడు. లుక్స్ పరంగా బాగున్నాడు, యాక్షన్ సీన్స్‌తో పాటు డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం అనుభవలేమి కనిపించింది. మంగ పాత్రకి రాషా తడాని తగిన న్యాయం చేసింది. మోహన్ బాబు తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శ్యామ్, అజయ్, వాసుకి తదితరులు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
