2027 సంక్రాంతి సీజన్ టాలీవుడ్లో ఇప్పుడే భారీ వేడి పుట్టిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు సంక్రాంతి బరిలో నిలవడంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద పోటీ ఎలా ఉండబోతోందన్న తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. పెద్ద హీరోలు, క్రేజీ కాంబినేషన్లు, భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సీజన్లో రావడం.. థియేటర్ల విషయంలోనే కాదు, ఓపెనింగ్స్ విషయంలోనూ గట్టి పోటీకి దారితీయనుంది.
ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాబీ కొల్లి దర్శకత్వంలో హై-వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘మెగా158’ తెరకెక్కుతోంది. గత సంక్రాంతికి వచ్చి సూపర్‌హిట్ కొట్టిన సెంటిమెంట్‌ను ఈసారీ రిపీట్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కూడా ఈ రేసులో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫుల్ లెంత్ ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానుంది. సంక్రాంతి సీజన్‌ను పూర్తిగా తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడిపై ఈసారీ భారీ అంచనాలున్నాయి.
ఇక మాస్ మహారాజా రవితేజ, శ్రీవిష్ణు కాంబినేషన్లో హసిత్ గోలి దర్శకత్వంలో భిన్నమైన కథతో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. భిన్నమైన ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తుండటంతో ఆసక్తి పెరిగింది. మరోవైపు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కూడా ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉంటున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాతో మాస్, కామెడీ ఎంటర్టైనర్ కూడా బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఇన్ని సినిమాలు ఒకేసారి బరిలో దిగుతుండటంతో థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్స్, వసూళ్ల పరంగా గట్టి పోటీ తప్పదు. ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే వసూళ్లు పంచుకోవాల్సి ఉంటుంది. కేవలం సంక్రాంతి సెంటిమెంట్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా, ఇతర సీజన్లను కూడా నిర్మాతలు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
