మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా కాన్సెప్ట్, కథలోని విలన్ పాత్రపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమా కథకు అయ్యప్ప స్వామి భక్తి, 41 రోజుల దీక్షను ప్రధాన నేపథ్యంగా తీసుకున్నట్లు శివ నిర్వాణ వెల్లడించారు. చాలా కాలంగా అయ్యప్ప స్వామిపై తనకు ఉన్న ప్రత్యేక భక్తితో కూడిన ఆసక్తి నుంచే ఈ కథకు బీజం పడిందని చెప్పారు. తాగుడు అలవాటు ఉన్న ఓ వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత, ఆ 41 రోజుల నిష్ఠ సమయంలో అతడి జీవితంలో వచ్చే మార్పులు, భావోద్వేగాలు, కూతురితో ఉన్న అనుబంధం ఈ చిత్రంలో కీలకంగా ఉండనున్నాయి. ఈ టైమ్‌లైన్ కథకు ప్రత్యేకమైన థ్రిల్‌ను ఇస్తుందని, ఫ్యామిలీ డ్రామాలోకి థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించినట్లు తెలిపారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఒక విలన్ పాత్రను పెట్టాలని తనకు అనిపించలేదని శివ నిర్వాణ స్పష్టం చేశారు. హీరో ఎదుర్కొనే సంఘటనలనే విలన్లుగా చూపించాలనే వినూత్న ఆలోచనతో ఈ కథను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఒక గ్రామంలో జరిగే కొన్ని సంఘటనల్లో హీరో చిక్కుకోవడం, వాటి వెనుక ఉన్న అసలు విషయాలు అతనికి క్రమంగా తెలియడం ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
ఈ చిత్రాన్ని అత్యంత విభిన్నంగా మలచడానికి కథలో మూడు ప్రధాన లేయర్లను ఏర్పాటు చేసినట్లు శివ నిర్వాణ తెలిపారు. మొదటి లేయర్‌గా హీరో అయ్యప్ప స్వామి భక్తుడు కావడం, రెండో లేయర్‌గా ఒక అయ్యప్ప భక్తుడి జీవితంలో ఏర్పడే అలజడిని చూపించనున్నారు. ఇక మూడో లేయర్‌గా ఆ సంఘటనలు ఎమోషనల్ టర్న్ తీసుకుని క్రైమ్, థ్రిల్లర్ అంశాల వైపు ప్రయాణించనున్నట్లు ఆయన వివరించారు.
భక్తి, కుటుంబ భావోద్వేగాలు, థ్రిల్లర్, క్రైమ్ అంశాలను మేళవిస్తూ రూపొందిస్తున్న ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. రేపు (ఆగస్టు 21) విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
