పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ బ్లాక్‌బస్టర్ హిట్‌కి సీక్వెల్‌గా రాబోతున్న ‘సలార్ 2’ కోసం రెబల్ స్టార్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్ పనులపై దృష్టి సారించడం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. పాన్ ఇండియా దర్శకుడిగా దూసుకుపోతున్న నీల్‌తో ప్రభాస్ తిరిగి పనిచేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు శరవేగంగా పూర్తికావలసి ఉంది. ‘ఫౌజీ’తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ పనులను 2027 ఏప్రిల్ నాటికి ముగించేస్తే.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ఫైనల్ స్క్రిప్ట్‌కు ప్రభాస్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌తో పాటు ‘సలార్ 2’ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రభాస్ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ వేగవంతం కావడంలో ఎన్టీఆర్ పాత్ర కూడా కీలకంగా మారింది. ఇటీవల అనుకోని గాయం కారణంగా ఎన్టీఆర్ తన ‘డ్రాగన్’ మూవీ చిత్రీకరణకు 2 నుంచి 3 నెలల పాటు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విరామ సమయాన్నే ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ స్క్రిప్టును పూర్తి చేసే పనిలో వినియోగిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్‌లను సమర్థవంతంగా మ్యానేజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ తన ప్లానింగ్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకుని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం ‘డ్రాగన్’ షూటింగ్‌ను పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తేనే.. ప్రశాంత్ నీల్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రభాస్‌తో ముందుకు సాగించేందుకు మార్గం సుగమం అవుతుంది.
సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు రాబోయే సీక్వెల్ ఎలాంటి ఆలస్యం లేకుండా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం 2027-28 సీజన్లో విడుదలయితే ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప 2’ తరహాలో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయితే లైనప్ మరింత సులభతరం అవుతుంది.
మొత్తానికి ప్రభాస్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలైన ‘కల్కి 2’, ‘సలార్ 2’లను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రెండింటిని వేగంగా పూర్తి చేసి అభిమానులకు బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ ట్రీట్ ఇస్తారని అంతా ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకుని తన సినిమాను పూర్తి చేస్తే… ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబో పట్టాలెక్కడానికి లైన్ క్లియర్ అయినట్టేనని పరిశ్రమలో గట్టిగా చర్చ జరుగుతోంది.
