హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన భారీ మారణహోమం మధ్యలో.. ప్రభాస్ దోతి ధరించి, రెండు చేతుల్లో పిస్టల్స్‌తో, ఒంటి నిండా రక్తంతో కనిపించారు. అయితే ఆయన ముఖాన్ని చూపించకుండానే ఈ పోస్టర్‌ను డిజైన్ చేయడం విశేషం. మరోవైపు, ఈ పోస్టర్లో మహాత్మా గాంధీ అహింసా మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రభాస్ మాత్రం తుపాకులతో హింసాత్మక పోరులో ఉన్నట్లు చూపించారు. “ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వస్తున్న ఈ పోస్టర్ సినిమా కథాంశంపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్ జంద్యం ధరించి, శవాల మధ్య కూర్చున్నట్లు చూపించగా.. తాజా పోస్టర్ దానిని మించిపోయేలా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైనికుడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వై. రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తుండగా, 2026 డిసెంబర్ 3న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
