దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సాంప్రదాయ వైద్య విద్య భవిష్యత్తుపై సంచలన ప్రశ్నలు లేవనెత్తారు. కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, వైద్యుల శిక్షణ , వైద్య సేవలు అందించే విధానమే పూర్తిగా మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘ఎడ్యుకేషన్ షుడ్ బి కిల్డ్’ అనే టైటిల్‌తో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
సాంప్రదాయ విద్యా విధానమనేది కేవలం బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, డిగ్రీ సంపాదించి ఉద్యోగం వెతుక్కోవడం అనే ఒక సాధారణ సూత్రంగా మారిపోయిందని, ఈ విధానం కాలం చెల్లినదని వర్మ విమర్శించారు. వైద్య విద్యను ప్రస్తావిస్తూ.. విద్యార్థులు ఎంబీబీఎస్, పీజీ, స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి దాదాపు దశాబ్ద కాలం వెచ్చిస్తున్నారని, కానీ ఏఐ టూల్స్ మాత్రం క్షణాల వ్యవధిలో అపారమైన వైద్య సమాచారాన్ని సేకరించి విశ్లేషించగలవని పేర్కొన్నారు. సంప్రదాయకంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి, డేటాను అధ్యయనం చేసి, నిర్ధారణకు వస్తారని.. అయితే ఏఐ ఎలాంటి అలసట లేకుండా వీటిని మరింత వేగంగా, కచ్చితత్వంతో చేయగలదని ఆయన తెలిపారు.
ఏఐ రంగ నిపుణుడు జెఫ్రీ హింటన్ హెచ్చరికలను కూడా వర్మ ఈ సందర్భంగా ఉదహరించారు. రోగ నిర్ధారణ (డయాగ్నోసిస్) పూర్తిగా అల్గారిథమ్ ఆధారితంగా మారుతున్నప్పుడు, సర్జరీలు రోబోటిక్ సిస్టమ్స్ ద్వారా జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఇంకా నీట్ కోసం ఎందుకు ప్రిపేర్ కావాలని, సుదీర్ఘమైన వైద్య కోర్సుల్లో ఎందుకు చేరాలని ఆయన ప్రశ్నించారు. “రోగ నిర్ధారణ అల్గారిథమ్‌గా మారినప్పుడు, సర్జరీ రోబోటిక్‌గా మారినప్పుడు మానవ వైద్యుడు క్రమంగా ఒక మధ్యవర్తిగా మారిపోవచ్చు” అని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫోన్లలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మేం ఎందుకు బట్టీ పట్టాలని ప్రశ్నించే విద్యార్థులను తిరుగుబాటుదారులుగా చూస్తున్నారే తప్ప, వారి లేవనెత్తుతున్న ప్రశ్నల్లోని న్యాయాన్ని గుర్తించడం లేదన్నారు. తన వ్యాఖ్యలు తల్లిదండ్రులను లేదా ఉపాధ్యాయులను అవమానించేలా ఉండవని స్పష్టం చేస్తూనే, సమాజంలో జరుగుతున్న మార్పులను చాలా మంది గ్రహించలేకపోతున్నారని లేదా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. కాలం చెల్లిన విద్యా వ్యవస్థ ఇప్పటికే మార్చురీలో ఉందని, దానిని ఎందుకు ఖననం చేయడానికి వెనుకాడతున్నామని ప్రశ్నించారు. యువత భవిష్యత్తు దెబ్బతినకముందే వారిని ఏఐ వైపు నడిపించాలని ఆయన సూచించారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఆన్లైన్లో మిశ్రమ స్పందనను తెచ్చిపెట్టాయి.
