మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ‘ఇరుముడి’ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, మెగాస్టార్ చిరంజీవి సినిమా రికార్డును బద్దలుకొట్టింది. తండ్రి-కూతురు ఎమోషనల్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు , వసూళ్లు:
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఇరుముడి’ చిత్రం భారత్ వ్యాప్తంగా మొదటిరోజు రూ. 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 2,673 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా, తొలిరోజే 76.9 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని సాధించింది.
ఇండియాలో గ్రాస్ పరంగా రూ. 17.20 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 7 కోట్లు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ఈ చిత్రం రూ. 24.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
తెలుగు వెర్షన్ హవా , చిరంజీవి రికార్డు బ్రేక్:
ఈ భారీ వసూళ్లలో సింహభాగం తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి. ఒక్క తెలుగు వెర్షనే రూ. 14.78 కోట్ల నెట్ రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లోని 2,591 షోలకు గాను సగటున 79 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా రాత్రి ఆటలకు ఏకంగా 88.08 శాతం థియేటర్లు నిండిపోయాయి.
బుక్ మై షోలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పేరిట ఉన్న ఆల్‌టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును రవితేజ ‘ఇరుముడి’ బద్దలుకొట్టింది. చిరంజీవి సినిమాకు ఒక్క గంటలో 31.6 వేల టికెట్లు అమ్ముడుపోగా, ‘ఇరుముడి’ టికెట్లు ఏకంగా 32.25 వేలకుపైగా సేల్ అయ్యాయి. పాన్ ఇండియా సినిమాలను పక్కనపెడితే రీజనల్ మూవీస్‌లో ఇదే అత్యధిక టికెట్ సేల్స్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కథ , భావోద్వేగాలు:
ఈ చిత్రంలో రవితేజ ‘త్రినాథ్’ అనే భక్తి భావం కలిగిన అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించారు. మద్యం వ్యసనం ఉన్న త్రినాథ్, తన కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) మధ్య ఉండే అనుబంధం కథకు ప్రధాన బలంగా నిలిచింది. పిల్లల పెంపకం, వారిపై చూపే ప్రేమ , తండ్రీకూతుళ్ల బంధం చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
