ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్ర దంపతుల కుమారుడు నంద వనమాలి (నందు) వివాహం.. ఉషాకోయిల చంద్రకళ – ప్రకాష్ దంపతుల కుమార్తె శృతితో సెప్టెంబర్ 4న హనుమకొండలోని శ్యామ్పేట డి-కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నూతన వధూవరుల వివాహం సాంప్రదాయబద్ధంగా కన్నులపండువగా ముగిసింది.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్..
హనుమకొండలో జరిగిన వివాహ వేడుక తర్వాత, సెప్టెంబర్ 6 రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పారామంలో నందు – శృతిల రిసెప్షన్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు.
హాజరైన టాలీవుడ్ దిగ్గజాలు..
ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకులు సుకుమార్ దంపతులు, సందీప్ రెడ్డి వంగా, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి, దిగ్గజ నటులు బ్రహ్మానందం తదితరులు ఈ వేడుకలో ప్రత్యక్షమై నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు.
ప్రత్యేక ఆకర్షణగా శృతి..
ఈ వివాహ వేడుకల్లో అందరి దృష్టిని శృతి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సినిమా రంగానికి చెందకుండా, ఒక సాధారణ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతి అయిన శృతి.. ఈ వేడుకలన్నింటిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ముచ్చట్లు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
