సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ‘గోద్ భరాయి’ (సీమంతం) వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మన సంప్రదాయాలు, ఆచారాల గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె రాసుకొచ్చిన ఎమోషనల్ నోట్ ప్రస్తుతం నెట్టింట అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సంప్రదాయాలపై సమంత ప్రత్యేక భావనలు..
చిన్నప్పటి నుంచి మన సంప్రదాయాలపై తనకు ఎంతో గౌరవం ఉందని సమంత తెలిపారు. ప్రతి ఆచారం వెనుక అసలు అర్థం పూర్తిగా తెలియకపోయినా, వాటి వెనుక ఒక బలమైన శక్తి, లోతైన అర్థం దాగి ఉంటాయని తాను గట్టిగా నమ్ముతానని పేర్కొన్నారు. మంత్రోచ్ఛారణల ద్వారా వెలువడే సానుకూల శక్తి, తరతరాలుగా వస్తున్న ప్రాచీన ఆచారాలు మనిషికి ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
‘కళావరణం’ క్రతువు విశేషాలు..
ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక క్రతువు గురించి వివరిస్తూ.. ‘‘కళావరణం అనేది శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ఒక ప్రత్యేకమైన క్రతువు. ఈ ప్రక్రియలో శ్రీవిద్య ఉపాసకులు మంత్రాలు పఠిస్తూ పవిత్ర జలంతో గర్భిణి అయిన మహిళకు అభిషేకం చేస్తారు. దీనివల్ల అమ్మవారి దివ్యమైన గుణాలు ఆ మహిళలో సరికొత్త చైతన్యాన్ని నింపుతాయని నమ్ముతారు’’ అని సమంత వెల్లడించారు.
ఈ మొత్తం క్రతువులో తనను ఎంతగానో కదిలించిన విషయం ఏమిటంటే.. తనలో మరో కొత్త ప్రాణానికి రూపమిస్తున్న సృష్టికర్త అయిన తల్లిని గౌరవించడమేనని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. గర్భంలో పెరుగుతున్న పసిబిడ్డకు ఇదొక అద్భుతమైన ఆశీర్వాదం మాత్రమే కాకుండా, మాతృత్వమనే సరికొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ప్రతి మహిళకు దొరికే గొప్ప వరం అని సమంత పేర్కొన్నారు.
