ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) ముంబైలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ చిత్ర పరిశ్రమలలో శక్తివంతమైన ప్రతినాయక పాత్రలతో ఆయన కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. దూరదర్శన్‌లో ప్రసారమైన బి.ఆర్. చోప్రా ప్రతిష్ఠాత్మక పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో అశ్వత్థామ పాత్ర ద్వారా ప్రదీప్ రావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1985లో విడుదలైన ‘మేరీ జంగ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ, టెలివిజన్ రంగమే ఆయనకు మొదటిసారిగా విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ‘లగాన్’లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్లో రాజమౌళి దర్శకత్వంలో 2004లో వచ్చిన ‘సై’ సినిమా ఆయన కెరీర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ చిత్రంలో ఆయన పోషించిన ‘భిక్షు యాదవ్’ పాత్ర తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు. అదేవిధంగా 2005లో తమిళంలో వచ్చిన ‘గజిని’ చిత్రంలో ఆయన చేసిన క్రూరమైన విలన్ పాత్రకు అద్భుతమైన స్పందన రావడంతో, 2008లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన హిందీ రీమేక్‌లోనూ ఆయనే ఆ పాత్రను పోషించి మెప్పించారు.
‘సర్ఫరోష్’, ‘స్టాలిన్’, ‘వీరం’, ‘1: నేనొక్కడినే’, ‘లౌక్యం’, ‘నేను శైలజ’, ‘సరైనోడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. వివిధ భాషలలో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్ అకస్మాత్ మరణం పట్ల సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
