టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల (75) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరగా.. జూలై 28 తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని వైద్యులు , కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె భౌతిక కాయాన్ని ప్రస్తుతం ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆమెకు, అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూసుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ ఏడాది మే నెలలో నిధుల కొరత కారణంగా ఒక ఆసుపత్రి ఆమెను చేర్చుకోకుండా వెనక్కి పంపడంతో ఆమె అర్ధరాత్రి రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి ఆమెను ఆదుకున్నారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు , ఆయన బృందం స్పందించి ఆమెకు సరైన వైద్యం అందేలా చూశారు. అలాగే గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా సేవలందించిన పావలా శ్యామల.. ‘గోలిమార్’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రవాలా’, ‘వర్షం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2019లో వచ్చిన ‘మథు వదలరా’ ఆమె చివరి ప్రధాన చిత్రంగా నిలిచింది. ఆమె నటించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో మీమ్స్‌గా కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
