యూపీఐ ఛార్జీల వసూలుపై అమెరికా ఒత్తిడి ఉందన్న వాదనలను కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి బాహ్య ప్రభావాలు లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తూ, దీనివల్ల విదేశీ సంస్థలకు ఎలాంటి లబ్ధి చేకూరదని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేగింది.
స్పష్టమైన విధానాలు..
ఈ నెల 15వ తేదీన ఎన్పీసీఐ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. యూపీఐపై రూపే మినహా ఇతర క్రెడిట్ కార్డ్ లావాదేవీలను అనుమతించబోమని ఆర్థిక సేవల విభాగం (DFS) గురువారం వెల్లడించింది. రూపే కార్డ్‌లను మాత్రమే అనుమతించాలనే అంశంపై స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. బాహ్య శక్తుల ప్రభావం వల్లే ఎండీఆర్ అమలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
రాజకీయ దుమారం , విమర్శలు..
యూపీఐ చెల్లింపులపై ఛార్జీల వసూలు నిర్ణయానికి పార్లమెంటరీ స్థాయి సంఘంలోని తమ ఎంపీలు మద్దతు తెలిపారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది.
