అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి, ఇరవై సంవత్సరాల క్రితం ఆకుతోటపల్లికి చెందిన రామకృష్ణారెడ్డితో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.
దీపారెడ్డి తన కారులో ప్రయాణిస్తూ న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దంపతులకు సంస్కృత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విదేశాల్లో జరిగిన ఈ దుర్ఘటనతో స్వగ్రామైన ఆకుతోటపల్లితో పాటు మాడుగులలో విషాదఛాయలు అలుముకున్నాయి.
