భారత రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్యాంకు నిరోధక ‘జావెలిన్ ఆల్ అప్ రౌండ్’ క్షిపణి వ్యవస్థల ఉత్పాదకత కోసం అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్య సంస్థ అయిన జావెలిన్ జాయింట్ వెంచర్ (జేజేవీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోనే జావెలిన్ ఏఐఆర్ తుది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ ప్లాంట్‌తో పాటు విడిభాగాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పే ప్రణాళికలను రెండు సంస్థలూ సిద్ధం చేస్తున్నాయి.
భారత రక్షణ రంగం బలోపేతం..
ఒప్పంద నిబంధనల ప్రకారం.. అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన అలబామా (ట్రాయ్) ప్లాంట్‌లో సబ్-అసెంబ్లీ కిట్లు, రేథియాన్‌కు చెందిన అరిజోనా ప్లాంట్‌లో గైడెన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్లు తయారవుతాయి. అక్కడ ఉత్పత్తి చేసిన ప్రధాన విడిభాగాలను భారత్‌కు తరలించి, ఇక్కడి ప్లాంట్‌లో తుది అసెంబ్లీ నిర్వహిస్తారు. ఈ విధానంతో అమెరికా ప్లాంట్‌లో ఉద్యోగ భద్రత లభించడంతోపాటు, భారత్‌లో రక్షణ రంగానికి అవసరమైన ఉన్నతస్థాయి నైపుణ్యాభివృద్ధి, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. భారత సైనిక దళాలకు ఆధునిక యుద్ధ పరికరాలు వేగంగా అందుబాటులోకి వస్తాయని, భారీ పరిమాణంలో ఉమ్మడిగా ఉత్పత్తి చేపట్టడం వల్ల ఒక్కో క్షిపణి తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ. 434.84 కోట్ల ఒప్పందంలో భాగంగా..
అమెరికా విదేశాంగ శాఖ గతంలోనే భారత్‌కు జావెలిన్ క్షిపణి విక్రయానికి అనుమతించింది. ఫారిన్ మిలటరీ సేల్స్ (ఎఫ్ఎంఎస్) కింద రూ. 434.84 కోట్ల (45.7 మిలియన్ డాలర్లు) అంచనా వ్యయంతో 100 ఎఫ్‌జీఎం-148 జావెలిన్ క్షిపణులు, ఒక ఫ్లై-టు-బై క్షిపణి, 25 తెలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి భారత్ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ భాగస్వామ్యంపై లాక్‌హీడ్ మార్టిన్ జావెలిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచ్ లిక్కియాన్ మాట్లాడుతూ.. భారత్‌లో అసెంబ్లీ ప్లాంటు ఏర్పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. టీఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ.. అమెరికా రక్షణ సంస్థలతో మా భాగస్వామ్యం ఇది మరో ముఖ్యమైన అడుగు అని, నైపుణ్యాల మార్పిడి వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
