న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని, ఆ దేశాన్ని నరకానికి పంపుతానని హెచ్చరించారు. ఇరాన్ విషయమై రెండు మార్గాలున్నాయని, ఒకటి ఒప్పందం కుదుర్చుకుని ఆ దేశ పునర్నిర్మాణానికి సహకరించడం లేదా మరింత తీవ్రమైన సైనిక చర్య చేపట్టడమని తేల్చిచెప్పారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.
భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ పునరుద్ఘాటణ..
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం కూడా ఉందని మరోసారి గుర్తుచేశారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడం ద్వారా దాదాపు మూడు కోట్ల మంది ప్రాణాలను కాపాడామని, ఇందుకు పాక్ ప్రధానితో పాటు పలు దేశాల అధినేతలు తనకు కృతజ్ఞతా లేఖలు రాశారని చెప్పారు. ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా దేశాల నేతలు కూడా తనను ప్రశంసించినట్లు తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంపై సుంకాల అస్త్రం..
ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించిన ట్రంప్.. వేల మంది ప్రాణాలు బలిగొంటున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇటీవలి చట్టం ద్వారా తనకు సంక్రమించిన సుంకాల (Tariffs) అధికారాలను ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అమెరికా వద్ద ఆయుధాల కొరత ఉందన్న వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించేందుకు కావాల్సినన్ని ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
