ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశాల (UNGA) నేపథ్యంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య మూడు గంటల పాటు ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ అభ్యర్థన మేరకే ఈ సమావేశం జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు ఇరాన్ కొన్ని ప్రధాన షరతులను అమెరికా ముందుంచింది.
ఇరాన్ షరతులు..
అమెరికా విధిస్తున్న నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను విడుదల చేయాలని మరియు అన్ని మోహరింపులు, దాడులను నిలిపివేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ డిమాండ్ చేశారు. ఈ షరతులకు అమెరికా సానుకూలంగా స్పందిస్తే ఏడు రోజుల్లోపు హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ చర్చలు చాలా బాగా జరిగాయని, భవిష్యత్తులోనూ మరో విడత చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
హర్మూజ్ సమీపంలో పేలుళ్ల కలకలం..
మరోవైపు ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చలు జరుపుతున్న తరుణంలోనే, హర్మూజ్ జలసంధి సమీపంలోని ఖేష్మ్ ద్వీపం వద్ద భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతం తరచూ దాడులకు గురవుతుండగా, తాజా పేలుళ్ల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
