రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకుపైగా ఘర్షణలు కొనసాగుతుండగా, ఇటీవలి కాలంలో అవి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ భారతీయులకు సంబంధించి ఒక ముఖ్యమైన అభ్యర్థన చేశారు. మోసం , కుతంత్రాలతో భారతీయులను రష్యా ఈ యుద్ధంలోకి లాగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఆయన కోరారు. ఐక్యరాజ్యసమితి 81వ సర్వప్రతినిధి సభ సమావేశంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివిధ దేశాల పౌరుల మరణాలపై ఆందోళన..
రష్యా ఈ యుద్ధం కోసం ఏకంగా 47 దేశాల ప్రజలను పావుగా వాడుకుంటోందని జెలెన్స్కీ వెల్లడించారు. ఘనా, నేపాల్, తజికిస్థాన్, భారత్, యెమెన్, కెన్యా, క్యూబా వంటి పలు దేశాల పౌరులు ఈ యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా మోసపూరిత హామీలతో రష్యాలో చిక్కుకుపోయిన విదేశీయులని తెలిపారు. ఆయా దేశాల ప్రతినిధులందరితో తాను నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు పేర్కొంటూ.. మీ ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి, వారిని యుద్ధ క్షేత్రానికి వెళ్లకుండా కాపాడుకోండి అని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా రష్యాను ఎవరూ అనుమతించవద్దని హితవు పలికారు.
ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు..
ఇరు దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని పరస్పరం దాడులు చేసుకుంటున్నాయని, వాటిని వెంటనే ఆపాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి తెస్తోందని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. దీనిపై జెలెన్స్కీ స్పందిస్తూ.. రష్యాకు చెందిన పెట్రోల్, డీజిల్ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేయడం తమ ఉద్దేశం కాదని, కేవలం రష్యా దురాక్రమణకు నిధులు సమకూర్చే ఆదాయ వనరులను దెబ్బతీయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే భారత్, చైనా వంటి దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించడం వల్లనే ఈ యుద్ధం మరింత ఎక్కువకాలం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా కౌంటర్..
రష్యాతో వాణిజ్యం నిలిపివేయాలంటూ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై పుతిన్ ప్రభుత్వం స్పందించి కౌంటర్ ఇచ్చింది. భారత్ వంటి దేశాలకు తాము అందిస్తున్న ముడి చమురు ఎగుమతులు.. అంతర్జాతీయ మార్కెట్లో పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన ప్రభావాన్ని తగ్గించడానికి ఎంతో దోహదపడ్డాయని రష్యా పేర్కొంది.
