చేతిలో చిల్లిగవ్వ లేదు, సినిమా బ్యాక్‌గ్రౌండ్ అంతకంటే లేదు. ఉన్నదల్లా అద్దెకు తెచ్చుకున్న ఒక చిన్న కెమెరా, హాలీవుడ్లో అడుగుపెట్టాలనే పెద్ద కల! ఆ కలనే నమ్ముకుని లాస్ ఏంజెలెస్ బాట పట్టిన గగన్‌దీప్ సింగ్ గిల్.. నేడు అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ గ్లోబల్ ఫిల్మ్‌మేకర్‌గా ఎదిగాడు.
గుజరాత్‌లోని ఆనంద్ పట్టణానికి చెందిన గగన్‌దీప్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. పన్నెండో తరగతిలో ఓ సినిమా చూస్తుండగా ‘ఇది నేనైతే ఇంకా బాగా తీయగలనేమో’ అనే ఆలోచన మొదలై, క్రమంగా అదే ఆయన లక్ష్యంగా మారింది. చాలామందిలాగే ఇంజినీరింగ్ పూర్తి చేసినా, మనసు మాత్రం సినిమాల చుట్టూనే తిరిగేది. కాలేజీలో స్నేహితులతో కలిసి అద్దె కెమెరాతో చిన్న చిన్న వీడియోలు తీస్తూ తనలోని దర్శకుడికి ప్రాణం పోశాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యే సమయానికి కొవిడ్ సంక్షోభం తలెత్తినా, ఆరు నెలలు కష్టపడి ఓ పోర్ట్‌ఫోలియో తయారు చేసుకున్నాడు. దాన్ని చూసిన అమెరికాలోని ‘ఆర్ట్ సెంటర్ కాలేజ్ ఆఫ్ డిజైన్’ అతడికి ప్రవేశం కల్పించింది.
అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం, వయసు చిన్నది కావడంతో చాలాసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే నిరుత్సాహపడకుండా చిన్న కంపెనీల ప్రాజెక్టులతో మొదలుపెట్టి, తనకంటూ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్నాడు. క్రమంగా లెవీస్, కొడాక్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. లెవీస్ ప్రకటనకు లాస్ ఏంజెలెస్ అమెరికన్ అడ్వర్టైజింగ్ ఫెడరేషన్ అవార్డుతో పాటు జాతీయస్థాయిలో యాడీ అవార్డు, అంతర్జాతీయ స్థాయిలో టెల్లీ అవార్డులను కైవసం చేసుకున్నాడు. బెర్లిన్ కమర్షియల్ ఫెస్టివల్, లాస్ ఏంజెలెస్ షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రతిభ చాటాడు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో అడ్వర్టైజింగ్ ఫిల్మ్‌మేకర్‌గా రాణిస్తూనే, స్వాతంత్ర్య సమరయోధుల నాటి కథతో తన డ్రీమ్ మూవీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు.
