అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం ‘కింగ్ 100’. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ లేవు. తాజాగా నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం అదిరిపోయే గ్లింప్స్తో పాటు ఫస్ట్ లుక్ను విడుదల చేసి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది.
నాగార్జున పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో ప్రారంభమయ్యే ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ‘‘మనుషుల్లో రెండు రకాలు. ఒకరు డబ్బున్నోళ్లు, ఇంకొకరు లేనివాళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను అందరూ లూజర్లా చూశారు. డబ్బు ఉన్నప్పుడు ‘దే కాల్ మీ ది కింగ్’. దిస్ ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మనీ. ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉండాలి’’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ సినిమా కథాంశం ఏంటో స్పష్టంగా చెబుతోంది.
విజువల్స్ బట్టి చూస్తే, ఈ కథ పేదరికం నుంచి ఎదిగి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి ప్రయాణం చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. డబ్బు లేనప్పుడు ఎదురైన అవమానాలు, ఆ తర్వాత సంపాదించిన హోదాను కాపాడుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్రానికి ప్రధాన బలంగా కనిపించనుంది. ఇక గ్లింప్స్ చివరిలో నాగార్జున ఒక చిన్నారిని ఎత్తుకుని కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఆ పాప ఎవరు, కథతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెరపై చూడాల్సిందే.
