అమెరికాలో స్థిరపడాలని భావించే వలసదారులు, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ కుటుంబాలకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక ప్రకటన చేసింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పరిశీలించే విధానంలో అత్యంత కీలకమైన ‘పబ్లిక్ ఛార్జ్’ అనర్హత నిబంధనలపై స్పష్టతనిస్తూ యూఎస్సీఐఎస్ విస్తృతమైన కొత్త విధాన మార్గదర్శకాలను విడుదల చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సమర్పించిన తుది నియమావళి ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త నిబంధనలు రాబోయే సెప్టెంబర్ 18 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఆ తేదీ నుంచి దాఖలయ్యే హోదా సర్దుబాటు దరఖాస్తులన్నింటికీ (ఫారం I-485) ఈ నవీకరించిన నిబంధనలే వర్తించనున్నాయి.
ఆర్థిక స్వయం సమృద్ధికి పెద్దపీట..
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందే వ్యక్తులు పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా, తమకు తాముగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలను తీసుకువచ్చారు. దరఖాస్తుదారులను సమీక్షించే క్రమంలో వారి వయస్సు, ఆరోగ్యం, కుటుంబ స్థితి, ఆస్తులు, ఆర్థిక వనరులు, చదువు , నైపుణ్యాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. సెప్టెంబర్ 18 తర్వాత దరఖాస్తుదారులు గృహ సహాయం, ఫుడ్ స్టాంపులు లేదా కళాశాల ఆర్థిక సహాయం వంటి ఆదాయ-ఆధారిత ప్రభుత్వ ప్రయోజనాలు ఏవైనా పొందితే.. అది దరఖాస్తు తిరస్కరణకు ప్రతికూల అంశంగా మారుతుంది. గతంలో పొందిన నగదు సహాయం, దీర్ఘకాలిక వైద్య సంస్థాగత సంరక్షణను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు.
మినహాయింపులు..
అయితే, కేవలం ఒక్క కారణంతోనే దరఖాస్తును స్వయంచాలకంగా తిరస్కరించబోమని, ప్రతి కేసును సమగ్రంగా వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగానే సమీక్షిస్తామని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. తాత్కాలిక నిరుద్యోగం, వైకల్యం లేదా వయస్సు వంటి కారణాలను మాత్రమే ప్రాతిపదికగా చేసుకుని ఎవరినీ అనర్హులుగా ప్రకటించరు. ఒకవేళ పబ్లిక్ ఛార్జ్ కారణంతో సమస్య తలెత్తితే.. విచక్షణ మేరకు ‘ఫారం I-945’ ద్వారా పబ్లిక్ ఛార్జ్ బాండ్ సమర్పించే అవకాశం కల్పిస్తారు. ఈ కొత్త చట్టాలు కుటుంబ ఆధారిత, ఉపాధి ఆధారిత (Employment-Based) గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులందరికీ వర్తిస్తాయి. అయితే శరణార్థులు, ఆశ్రయం కోరినవారు, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించింది. సెప్టెంబర్ 18 నుంచి పాత ఫారం I-485 వెర్షన్లు రద్దవుతాయని, కేవలం కొత్త ఫారమ్‌లను మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేయడంతో.. దరఖాస్తుదారులు తగిన ఆర్థిక పత్రాలతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
