- నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి ఎన్నారైలు నైపుణ్యాన్ని అందించాలి: డా. చంద్రశేఖర్ పెమ్మసాని
- 2029 విజయానికి కదలిరావాలి: జయరాం కోమటి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు(ఎన్నారైలు) కీలక భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయవాడలోని కేంద్ర టీడీపీ కార్యాలయంలో జరిగిన ‘గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ’ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయనతో పాటు కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, ఉత్తర అమెరికా రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, మరియు గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ గురురాజా పాల్గొన్నారు.
తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు:
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్‌లో ఆంధ్రులను కేవలం ‘తమిళియన్లు’గా మాత్రమే గుర్తించేవారని, ఆ సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన విజనరీ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి నలభై ఏళ్ల ముందుచూపుతో ప్రణాళికలు రచించారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిందని, ఈ దశలో ఎన్నారైల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన ఉద్ఘాటించారు. తానూ ఒక ఎన్నారైగానే పార్టీపై, చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టానని శ్రీనివాస్ తెలిపారు.
కష్టకాలంలోనూ, ఎన్నికల సమయంలోనూ ఎన్నారైలు అందించిన సేవలను ఎవరూ మర్చిపోలేరని ఆయన అన్నారు. రాష్ట్ర పునరుద్ధరణ కోసం సీఎం చంద్రబాబు దశా నిర్దేశం చేస్తుండగా, యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నారైల సేవలకు గుర్తింపుగానే డాక్టర్ గురురాజా అధ్యక్షతన గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

మీ విజ్ఞానం, నైపుణ్యం రాష్ట్రానికి అవసరం: డా. చంద్రశేఖర్ పెమ్మసాని
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ, సుమారు ముప్పై ఏళ్ల క్రితమే భవిష్యత్తును అంచనా వేసి రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించి, లక్షలాది మంది యువతను ప్రపంచ దేశాలకు పంపిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. యువ నాయకుడు నారా లోకేశ్ కూడా ఎన్నారైల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. అమరావతి నిర్మాణం, రైతుల ఆందోళనలు, ఎన్నికలు.. ఇలా ప్రతి దశలోనూ ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. ఎన్నారైలు తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
2029లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి: జయరాం కోమటి
ఉత్తర అమెరికాకు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి మాట్లాడుతూ, టీడీపీకి ఎన్నారైల మద్దతు వెలకట్టలేనిదన్నారు. కష్టకాలంలో నిస్వార్థంగా పనిచేసిన ఎన్నారైలు, డాక్టర్ గురురాజా నాయకత్వంలో మున్ముందు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తానూ ఒక కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, చంద్రబాబు నాయకత్వానికి ఆకర్షితుడనై టీడీపీలో చేరానని గుర్తుచేశారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ సభ్యులంతా మరింత బాధ్యతతో పనిచేసి 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే మన ముందున్న లక్ష్యం: డాక్టర్ గురురాజా
గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గురురాజా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో నారా లోకేశ్ కృషి అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నారైలు చేసిన పోరాటం మరువలేనిదని, ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద లక్ష్యం నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర స్ఫూర్తితో టీడీపీలో చేరిన తాను, వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నప్పటికీ తన మనసు ఎప్పుడూ టీడీపీతోనే ఉందని ఆయన భావోద్వేగంగా చెప్పారు. యువత, మహిళలు, ఐటీ నిపుణులు, విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ కమిటీ లక్ష్యమని డాక్టర్ గురురాజా స్పష్టం చేశారు. “మళ్లీ మళ్లీ టీడీపీని గెలిపిస్తూనే ఉండాలి” అంటూ ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
