పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ నగరంలో జరగనున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్జీఏ) సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా ఇతర కీలక నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. ఆతిథ్య దేశంగా తమ బాధ్యతలకు అనుగుణంగానే ఈ అనుమతి ఇచ్చినట్లు యూఎస్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉంటుందని, అంతేకాకుండా వారిపై ప్రయాణ ఆంక్షలతో పాటు విలాస వస్తువుల కొనుగోలుపై నిషేధం ఉంటుందని వెల్లడించింది.
డొనాల్డ్ ట్రంప్ స్పందన..
అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని, కానీ అందుకు అవసరమైన షరతులను అంగీకరించేందుకు మాత్రం సిద్ధంగా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మనం చేసుకుంటే మంచి ఒప్పందం చేసుకుందాం.. లేకపోతే లేదు” అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్‌కు వీసాలు మంజూరు చేసిన అమెరికా ప్రభుత్వం.. పాలస్తీనా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి మాత్రం వీసాలను తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పంద హామీలను నిలుపుకోవడంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ సహా పలువురు ఉన్నతాధికారులు విఫలమయ్యారని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఐరాస వేదికపై సెక్రటరీ జనరల్ ఆవేదన..
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల నేపథ్యంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో తిష్ఠవేసిన అగ్రదేశాలే అంతర్జాతీయ చట్టాలను ఇష్టారీతిగా ఉల్లంఘిస్తున్నాయని, అందువల్లే ఈ ఉమ్మడి వేదిక నిస్తేజంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ వేదికను తక్షణమే సంస్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
