ఈసారి దసరా పండుగ సినిమా ప్రేమికులకు అత్యంత రసవత్తరంగా మారనుంది. పండుగ సీజన్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’, అలాగే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా వస్తున్న ‘రణబాలి’ చిత్రాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు భారీ చిత్రాలు విడుదలవుతుండటంతో టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మొదటి భాగంలో టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీ చూపించిన మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
మరోవైపు, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదలవుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ రెండు చిత్రాల ప్రమోషన్ల కోసం మేకర్స్ ఎంచుకున్న వినూత్న వ్యూహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టీజర్లు, ట్రైలర్లతో పాటు ‘బిహైండ్-ది-సీన్స్’ మేకింగ్ డాక్యుమెంటరీల ద్వారా ప్రచారం నిర్వహించే ఒకే రకమైన స్ట్రాటజీని ఈ రెండు చిత్రాల బృందాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే ‘జైలర్ 2’ టీమ్ విడుదల చేసిన స్పెషల్ డాక్యుమెంటరీ యూట్యూబ్‌లో ట్రెండింగ్ నిలవగా, ‘రణబాలి’ టీమ్ కూడా నాలుగు ఎపిసోడ్ల భారీ మేకింగ్ సిరీస్‌ను ప్లాన్ చేసింది.
సినిమా వెనుక ఉన్న కష్టం, టెక్నికల్ విలువలు , నటీనటుల శ్రమను డాక్యుమెంటరీల రూపంలో చూపించడం ద్వారా ప్రేక్షకుల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. మాస్ యాక్షన్‌తో ‘జైలర్ 2’, చారిత్రక కథాంశంతో ‘రణబాలి’ బరిలో నిలుస్తుండటంతో దసరా విన్నర్ ఎవరవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పండగ పూట ఏకకాలంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల పరంగా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.
