ఇంజనీరింగ్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ‘ఇంజనీరింగ్ నోబెల్ ప్రైజ్’గా పిలిచే ‘2026 జాన్ ఫ్రిట్జ్ మెడల్’ (John Fritz Medal)కు భారత సంతతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఆజాద్ ఎమ్. మద్నీ ఎంపికయ్యారు. ట్రాన్స్‌డిసిప్లినరీ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయన చేసిన వినూత్న పరిశోధనలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC)లో విటర్బీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, సిస్టమ్స్ ఆర్కిటెక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు.
1902 నుంచి పురస్కారాల ప్రస్థానం..
మానవాళి పురోగతికి అసాధారణ తోడ్పాటు అందించిన ఇంజనీరింగ్ దిగ్గజాలకు 1902 నుంచి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. గతంలో థామస్ అల్వా ఎడిసన్, అలెగ్జాండర్ గ్రాహం బెల్, క్లాడ్ షానన్, గోర్డాన్ మూర్, ఆండ్రూ విటర్బీ, ఎలన్ మస్క్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. ఆ మహనీయుల సరసన ఇప్పుడు ప్రొఫెసర్ ఆజాద్ మద్నీ స్థానం సంపాదించడం విశేషం. విభిన్న శాస్త్ర రంగాలు, ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్, గ్రీన్ లెర్నింగ్, వర్చువల్ వరల్డ్లలో ఇంటరాక్టివ్ స్టోరీటెల్లింగ్ అంశాలను అనుసంధానిస్తూ సంక్లిష్టమైన సిస్టమ్స్ డిజైన్లను రూపొందించడంలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
ముంబై వీధుల నుంచి నాసా స్పేస్ షటిల్ ప్రాజెక్ట్ వరకు..
ప్రొఫెసర్ మద్నీ బాల్యం ముంబైలో సాగింది. అక్కడ సెయింట్ మేరీస్ హైస్కూల్, సెయింట్ జేవియర్స్ కాలేజీలలో చదువుకున్నారు. 1962లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ చారిత్రాత్మక మూన్ మిషన్ ప్రసంగం ద్వారా ఉత్తేజితుడై ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేశారు. 1965లో అమెరికా వెళ్లి UCLA నుంచి బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేశారు.
అనంతరం రాక్వెల్ ఇంటర్నేషనల్‌లో చేరి నాసా (NASA) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘స్పేస్ షటిల్ ప్రోగ్రామ్’లో పనిచేశారు. స్పేస్ షటిల్ నావిగేషన్ సిస్టమ్‌ను టెస్ట్ చేయడానికి మోడల్-బేస్డ్ విధానాన్ని అభివృద్ధి చేసి తన ప్రతిభను చాటుకున్నారు. 1994లో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ సంస్థను స్థాపించి, 2009లో USC యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు.
యుఎస్సి ప్రెసిడెంట్ బ్యోంగ్-సూ కిమ్, విటర్బీ స్కూల్ తాత్కాలిక డీన్ గౌరవ్ సుఖత్మేలు ప్రొఫెసర్ మద్నీని అభినందిస్తూ.. ఆయన పరిశోధనా పటిమ, ఆవిష్కరణలు గ్లోబల్ ఇంజనీరింగ్ రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేశాయని కొనియాడారు.
