హీరో నాని నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. సినిమా బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా థియేటర్లలోనూ అదే లోకల్ కనెక్షన్ తీసుకురావాలని నిర్ణయించింది. సాధారణంగా సినిమా హాల్స్‌లో పాప్‌కార్న్, సమోసాలు కనిపించడం కామన్. కానీ, ఇందుకు భిన్నంగా ‘ది ప్యారడైజ్’ ప్రదర్శితమయ్యే మైత్రి విమల్, మైత్రి శివగంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇంటర్వెల్ స్నాక్‌గా తెలంగాణ ప్రత్యేక వంటకమైన ‘సర్వపిండి’ని అందించనున్నారు.
77 ఏళ్ల బామ్మ వంటకు బిగ్ స్టేజ్..
ఈ ఆలోచన వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ‘బామ్మ స్టోరీస్’ పేరిట చిన్న టిఫిన్ సెంటర్ నడిపే 77 ఏళ్ల బామ్మ చేతి వంటను మైత్రి సంస్థ సెలెక్ట్ చేసుకుంది. పెద్ద ఫుడ్ బ్రాండ్లతో కాకుండా, స్థానికంగా ఎంతో రుచిగా ఉండే బామ్మ వంటకాన్ని ఎంచుకోవడం విశేషం. 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ మాస్ సినిమాకు, అక్కడి లోకల్ ఫుడ్ కల్చర్‌ను జోడించడం ద్వారా ప్రేక్షకులకు మరింత రియాలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్..
దసరా తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో అందించబోతున్న సర్వపిండి విశేషాలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
