హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘ది ప్యారడైజ్’ విషయంలో కోర్టు ఆర్డర్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై హీరో నాని స్పష్టతనిచ్చారు. సినిమా చూసి నిజం చెప్పే ప్రేక్షకులకు, విమర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, సినిమా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పడంలో ఎలాంటి తప్పులేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కావాలని సినిమాకు నష్టం కలిగించేలా తప్పుడు రివ్యూలు ఇవ్వడం, బాట్ అకౌంట్ల ద్వారా నెగిటివ్ ప్రచారం చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
కోర్టు ఆదేశాలపై అసలు నిజం..
సోషల్ మీడియాలో కొన్ని ఖాతాల ద్వారా సినిమాపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ‘ది ప్యారడైజ్’ నిర్మాతలు బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గుర్తించిన కొన్ని ఫేక్ అకౌంట్లు, పోస్టులు, యూఆర్ఎఫ్లకు మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టు ఆర్డర్ ఎవరి నిజాయితీ రివ్యూలకూ వర్తించదని, కేవలం ఫేక్ కంటెంట్, దురుద్దేశపూర్వక ప్రచారంపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని నాని స్పష్టం చేశారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 28న జరగనుంది.
‘ది ప్యారడైజ్’ విశేషాలు..
‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 1980ల సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ‘జడల్ జమానా’ అనే మాస్ పాత్రలో కనిపించనుండగా, మోహన్ బాబు విలన్గా నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
