ప్రముఖ అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సీఈఓ బాధ్యతలు టిమ్ కుక్ నుంచి జాన్ టెర్నస్‌కు బదిలీ అయ్యాయి. కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన టెర్నస్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 551 కోట్లు) వరకు మొత్తం వేతనం అందే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మారిన టిమ్ కుక్ 47 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 446 కోట్లు) అందుకోనున్నారు.
వార్షిక ప్యాకేజీ..
జాన్ టెర్నస్ ప్యాకేజీలో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 28 కోట్లు) వార్షిక జీతంగా ఉండగా, 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 523 కోట్లు) స్టాక్ అవార్డ్స్ రూపంలో ఉన్నాయి. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు టెర్నస్ అందుకున్న 25 మిలియన్ డాలర్ల (రూ. 237 కోట్ల) తో పోలిస్తే, సీఈఓ హోదాలో ఆయన జీతం రెట్టింపునకు పైగా పెరిగింది. మరోవైపు కుక్ ప్యాకేజీలో 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో పాటు 45 మిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. యాపిల్ షేర్ కదలికలకు అనుగుణంగా వీరికి అందే మొత్తం మారుతుంది.
తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ..
ఉద్యోగులకు రాసిన లేఖలో ఈనెల 9న కంపెనీ విడుదల చేసే ఉత్పత్తుల గురించి చూచాయగా టెర్నస్ తెలిపారు. భారీ ఆవిష్కరణ ఉండబోతోందని, అందుకు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరించాలని భావిస్తోందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. ఎయిర్‌పాడ్స్ (క్యామెరాలతో), స్మార్ట్ గ్లాసెస్, ఒక టేబుల్‌టాప్ హోమ్ రోబో, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ నూ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
