ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘డిజిటల్ ఇండియా’ ఆశయాలకు అనుగుణంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం (Consulate General of India) ప్రవాస భారతీయులకు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. వివిధ రకాల కాన్సులర్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా , సులభంగా అందించేందుకు గాను 12 ప్రధాన విభాగాలకు సంబంధించిన కాన్సులర్ సేవలను ‘ఈ-సేవ’ (e-SEWA) పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.
డిజిటల్ పద్ధతిలోనే దరఖాస్తులు..
నవంబర్ 1, 2026 నుండి ఈ 12 రకాల కాన్సులర్ సేవలు కేవలం ఈ-సేవ (e-SEWA) పోర్టల్ ద్వారా మాత్రమే పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం, ఆ తర్వాత కాన్సులేట్ ద్వారా ఆన్లైన్ స్క్రూటినీ పూర్తయ్యాక తదుపరి ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
ఈ-సేవ పరిధిలోకి వచ్చే 12 ప్రధాన కాన్సులర్ సేవలు..
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (Marriage Registration): వివాహ నమోదు ప్రక్రియ.
బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (Birth Registration Certificate): భారతీయ పౌరుల పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రం.
భారతీయ పత్రాల ధ్రువీకరణ (Attestation of Indian Documents): ఒసిఐ, పాన్, ఆధార్ మొదలైన పత్రాల దృవీకరణ.
అమెరికా పత్రాల ధ్రువీకరణ (Attestation of US Documents): యూఎస్ నివాస ధ్రువీకరణ, కరెంట్ బిల్లులు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాల అటెస్టేషన్.
లీగల్ డాక్యుమెంట్స్ అటెస్టేషన్ (Legal Document Attestation): పవర్ ఆఫ్ అటార్నీ (PoA), విల్లులు , అఫిడవిట్ల ధ్రువీకరణ.
యూఎస్సిఐఎస్ అవసరాల సర్టిఫికెట్లు (Certificates for USCIS Purposes): అమెరికా ఇమ్మిగ్రేషన్ అవసరాల కోసం అవసరమయ్యే సర్టిఫికెట్లు.
ఎడ్యుకేషన్ ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ (Education Equivalency Certificate): 10వ , 12వ తరగతుల విద్యా అర్హత ధ్రువీకరణ.
లైఫ్ సర్టిఫికేట్ (Life Certificate): పెన్షన్ మినహా ఇతర సాధారణ అవసరాల కోసం లైఫ్ సర్టిఫికెట్.
ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ (NRI Certificate): ప్రవాస భారతీయుల ధ్రువీకరణ పత్రం.
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC for Foreign Nationals): విదేశీ పౌరుల కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ రీఇష్యూ (International Driving Permit Reissue): అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ.
నోరి సర్టిఫికేట్ – స్టేజ్ III (NORI Certificate – Stage III): నో అబ్జెక్షన్ టు రిటర్న్ టు ఇండియా సర్టిఫికేట్ థర్డ్ స్టేజ్.
దరఖాస్తు చేసుకునే విధానం..
ప్రవాస భారతీయులు లేదా అభ్యర్థులు ముందుగా అధికారిక ఈ-సేవ పోర్టల్ ద్వారా సైన్ అప్ లేదా లాగిన్ కావచ్చు.
కావలసిన సేవను ఎంచుకుని, ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసి పత్రాలను అప్లోడ్ చేయాలి.
ఆన్లైన్ తనిఖీ పూర్తయిన తర్వాత పోస్టల్ ద్వారా లేదా విఎఫ్ఎస్ సెంటర్లో వ్యక్తిగతంగా ఒరిజినల్ పత్రాలు సమర్పించి ప్రాసెసింగ్ పూర్తి చేసుకోవచ్చు.
