అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ, భారతీయ అమెరికన్ ఓటర్లలో అత్యధికులు డెమోక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. అంతేకాకుండా, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారు ఎంతో ఆసక్తి చూపుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాలు, సెనేట్‌లోని 35 సీట్లతో పాటు పలు స్థానిక ప్రభుత్వ పదవులకు నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓటర్ నిర్వహించిన సర్వేలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
సర్వేలోని అంశాలు..
సర్వేలో పాల్గొన్న భారతీయ అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది కాంగ్రెస్, సెనేట్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థులకే తమ ఓటు అని స్పష్టం చేశారు. రిపబ్లికన్ అభ్యర్థులకు కాంగ్రెస్ ఎన్నికల్లో 18 శాతం మంది, సెనేట్ ఎన్నికల్లో 22 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో తమను సంప్రదించలేదని, ప్రచారం చేయలేదని కొందరు ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఆసియా అమెరికన్ ఓటర్లలో 42 శాతం మందిని డెమోక్రాటిక్ పార్టీ, 58 శాతం మందిని రిపబ్లికన్ పార్టీ సంప్రదించలేదని సర్వేలో తేలింది. పార్టీల నుంచి తగిన గుర్తింపు లేకపోయినప్పటికీ, ఆసియన్ అమెరికన్ , పసిఫిక్ ఐలాండర్ ఓటర్లలో ఓటింగ్‌పై ఆసక్తి మాత్రం అధికంగానే ఉంది. ఏకంగా 90 శాతానికి పైగా ఓటర్లు మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేయాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.
