దేశంలోని డేటా సెంటర్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన నెట్వర్కింగ్ సంస్థ సియోనాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంట్రోల్ఎస్ డేటాసెంట్ర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోని 5 కీలక మెట్రో నగరాల్లో హై-స్పీడ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
హై-స్పీడ్ మెట్రో నెట్‌వర్క్‌లు..
హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, దిల్లీ, నోయిడా నగరాల్లో ఉన్న తమ 9 డేటా కేంద్రాలను కలుపుతూ 5 హై-స్పీడ్ మెట్రో నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ సేవల కారణంగా పెరుగుతున్న బ్యాండ్‌విడ్త్ డిమాండ్‌ను తీర్చేందుకు ఈ నెట్వర్క్ సహాయపడనుంది. ఈ నెట్వర్క్ సెకనుకు 100 టీబీ (టెరా బైట్) వరకు ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని అందించనుందని కంపెనీ తెలిపింది.
మౌలిక వసతులు..
ప్రముఖ గ్లోబల్ హైపర్‌స్కేలర్ కోసం చేపట్టిన భారీ మేనేజ్డ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టుల్లో భాగంగా ఈ విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ కలిగిన డిజిటల్ వ్యాపారాల అవసరాలకు తగ్గట్టుగా బలమైన, సురక్షిత నెట్వర్క్ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని కంట్రోల్ఎస్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు.
