ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లను విరివిగా వాడుతోంది. తాజాగా అగ్రరాజ్యం తన అమ్ముల పొదిలోని లేజర్ వెపన్స్ శక్తిని హర్మూజ్‌లో ప్రయోగిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వీటితో ఇప్పటికే హర్మూజ్ వద్ద అనేక క్రూజ్ క్షిపణులు, డ్రోన్లను కూల్చినట్లు తెలిపాయి. మార్పులు చేసిన ఎక్స్‌బాక్స్ గేమ్ కన్సోల్ కంట్రోలర్లను ఈ లేజర్ ఆయుధాల ఆపరేటింగ్‌కు వాడుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టుపై 500 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు సమాచారం.
లేజర్ ఆయుధాల పనితీరు ..
క్షిపణుల వంటి ఖరీదైన ఆయుధాలను ఉపయోగించడం కంటే ఈ లేజర్ ఆయుధాల ద్వారా హర్మూజ్‌పై డ్రోన్లను, క్రూజ్ క్షిపణులను సమర్థంగా ధ్వంసం చేస్తున్నట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఆయుధాల సాంకేతికతను అమెరికా సుమారు 50 ఏళ్లుగా అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ యాంటీ-డ్రోన్, యాంటీ-మిసైల్ వ్యవస్థల్లా కాకుండా, లేజర్ ఆయుధాలకు భౌతిక ఇంటర్‌సెప్టర్ అవసరం లేదు. ఈ ఆయుధాలు జనరేటర్లు లేదా బ్యాటరీ ప్యాక్‌ల నుంచి శక్తిని గ్రహించి, దానిని ఫోటాన్లుగా మారుస్తాయి. అనంతరం వాటి కాంతి కణాలు లక్ష్యం ఉపరితలంపై పడి అది కాలిపోయేంత వేడిని పుట్టిస్తాయి.
భవిష్యత్తు అంచనాలు ..
ఇతర ఆయుధాలతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వీటిని యుద్ధ నౌకలపై మాత్రమే ప్రయోగించారని, మానవ లక్ష్యాలపై ఉపయోగించలేదని తెలిపారు. ఈ ఆయుధాలను మరింత అభివృద్ధి చేయగలిగితే ప్రపంచ దేశాలు ఇకపై మందుగుండు సామగ్రి నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని అభిప్రాయపడ్డారు. అయితే యుద్ధ భూమిలో ఈ లేజర్ ఆయుధాల వాడకాన్ని ట్రంప్ యంత్రాంగం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
