రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, ద్వైపాక్షిక వాణిజ్య పోరు వంటి పలు కీలక పరిణామాల మధ్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఎటువంటి పెద్ద ఒప్పందాలు కుదరకుండానే ముగిసింది. కృత్రిమ మేధ (ఏఐ), వాణిజ్యం వంటి అంశాలపై పెద్ద నిర్ణయాలేవీ ఈ భేటీలో వెలువడలేదు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత అమెరికాలో జిన్‌పింగ్ చేపట్టిన మూడు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది.
చర్చలపై ఇరు దేశాల అధినేతల సంతృప్తి..
ఈ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్‌తో తాను జరిపిన తాజా చర్చలు బీజింగ్-వాషింగ్టన్ బంధానికి కొత్త అర్థాన్నిచ్చాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవడానికి ఉజ్వల అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో రెండుసార్లు అమెరికా అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు (నవంబరులో చైనా వేదికగా జరగనున్న అపెక్ సదస్సులో, డిసెంబరులో అమెరికా వేదికగా జరగనున్న జి-20 సదస్సులో) ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ట్రంప్‌ను, ఆయన సతీమణిని చైనాకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొనగా.. దీనికి స్పందిస్తూ ట్రంప్ బదులిచ్చారు.
శ్వేతసౌధంలో సమావేశాలు ..
శుక్రవారం ఉదయం శ్వేతసౌధంలో జరిగిన తేనీటి విందు సందర్భంగా ట్రంప్, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. ఈ చర్చలతో ద్వైపాక్షిక సంబంధాల్లో ఘనమైన అడుగులు పడ్డాయని, ఈ పర్యటన అమెరికా రైతులకు ఎంతో సంతోషాన్నిస్తుందని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కమ్యూనిస్టు దేశాధినేత అయిన జిన్‌పింగ్‌ను ట్రంప్ స్వయంగా నేషనల్ ఆర్కైవ్స్‌కు తీసుకెళ్లి, అమెరికా ప్రజాస్వామ్య పవిత్ర గ్రంథాలను చూపించారు. గురువారం జరిగిన 90 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చల్లో పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతల వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
