తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.75/5
నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి, రోహన్ తదితరులు
సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్,
సినిమాటోగ్రాఫర్: అజీమ్ మహ్మద్,
ఎఢిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ & సాయి సౌజన్య
రచయిత & దర్శకుడు: ఆదిత్య హాసన్
విడుదల తేది : 11.09.2026
నిడివి :2 ఘంటల 40 నిముషాలు
‘బేబీ’ సినిమాతో సక్సెస్ఫుల్ జోడీ అనిపించుకున్నారు ఆనంద్ దేవరకొండ,(Anand Devarakonda) వైష్ణవి చైతన్య.(Vaishnavi Chaitanya) ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ (EPIC-First Semister)సినిమాతో వీరిద్దరూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. హీరోయిన్లుగా నటించిన సినిమా కావడంతో మొదటి నుంచీ ఇది మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ’90’s’ వెబ్ సిరీస్‌తో భీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్.(Aditya Hassan) పైగా 90’sకి ఇది సీక్వెల్ కూడా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా అతను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం తొలి థియేట్రికల్ మూవీ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అధిగమించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) చంద్రశేఖర్ (శివాజీ), రాణి (వాసుకి) దంపతుల చిన్న కొడుకు. ఆదిత్య డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో తను తీసిన షార్ట్ ఫిలింకు 12 వేల వ్యూస్ రావడంతో అతనిలో మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. కాని తల్లిదండ్రులు మాత్రం కొడుకు మంచి ఉద్యోగం చేయాలని ఆశపడతారు. బాగా సంపాదించాలంటే విదేశాలకు వెళ్లాలని, అప్పుడే కట్నం కూడా ఎక్కువ వస్తుందనే ఆలోచనతో కొడుకుని లండన్ ఫ్లైట్ ఎక్కించేస్తారు. ఇష్టం లేకపోయినా ఆదిత్య లండన్‌లో దిగుతాడు. 10 నెలలు కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఉండటానికి స్నేహితుల సాయంతో ఓ షేరింగ్ రూమ్ తీసుకుంటాడు. క్యాంపస్‌లోకి అడుగుపెట్టగానే.. కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. ఒక్కరోజులోనే వీళ్లు చాలా క్లోజ్ అవుతారు. ఆమె ఇండిపెండెంట్ అమ్మాయి. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఆదిత్య రూమ్‌కు కడలి షిఫ్ట్ అవుతుంది. ఇద్దరూ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఓ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుని ఫిజికల్‌గా ఒకటవుతారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో బ్రేకప్ చెప్పుకుంటారు. దానికి గల కారణాలు ఏమిటి? చివరికి వీళ్లు కలుసుకున్నారా? పెళ్లి
చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
‘బేబీ’తో సూపర్ హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మరో సారి ఈ సినిమాకు ప్రధాన బలం అనే చెప్పాలి. ఆదిత్య అనే అమాయకపు కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ పూర్తి న్యాయం చేసి చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశాడు. అమాయకత్వంతో కూడిన లుక్స్‌తో చక్కగా పాత్రలో ఒదిగిపోయాడు. అతను మాత్రమే ఈ పాత్రను చేయగలడనే భావన కలిగించాడు. మోడ్రన్, ఇండిపెండెంట్ అమ్మాయిగా వైష్ణవి చైతన్య చక్కని నటన కనబర్చింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఆదిత్య తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి కనిపించినంత సేపు బాగానే అలరించారు. కడలికి ఫ్యామిలీ ఉన్నట్లు చెప్పారు కానీ వారెవరో చూపించలేదు. కాకపోతే క్లైమాక్స్‌లో ఈమె పాత్రకు ఇచ్చిన ఎండింగ్ ఎందుకో అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. కళ్యాణ్ శంకర్ రోల్ కూడా కథలో కీలకం అయ్యింది. అతను పలికే డైలాగులు కొన్ని యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటాయి. గవిరెడ్డితో మంచి కామెడీ చేసే అవకాశం ఉన్నా పూర్తిగా ఉపయోగించుకోలేక పోయారు. ఫ్రెండ్స్‌గా నటించినవారంతా పరిధి మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాలో యూత్‌ఫుల్ మూమెంట్స్ ఎన్నో ఉన్నప్పటికీ.. వాటిని కలిపి బలమైన కథగా మార్చడంతో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ‘90’s లాంటి సిరీస్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఓ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడి సినిమా అంటే డెఫినెట్‌గా భారి అంచనాలు ఉంటాయి. దానికి తోడు ‘బేబీ’ లాంటి సూపర్ హిట్ జోడీ ఆ తర్వాత నటించిన సినిమా కావడంతో ఆ అంచనాలు అంబరాన్ని తాకుతాయి. కానీ వాటిని దర్శకుడు అందుకోలేకపోయాడు. సినిమాకు అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ ఎసెట్. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు బలం. ఫ్రెష్ మ్యూజిక్ అందించారు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బావుండేది. లండన్ నేపథ్యం ఉన్నప్పటికీ పెద్దగా వాడుకోలేదు. సింపుల్‌గా ఒకే లోకేషన్లో కానిచ్చేశారు. నిర్మాణ విలువలు సితార సంస్థకు తగ్గట్టు గ్రాండ్‌గా ఉన్నాయి.
విశ్లేషణ :
‘ఎపిక్’.. పూర్తిగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా.దర్శకుడి ‘90’s సిరీస్ కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. కాని ఈ సినిమా కొందరు మాత్రమే చూసేలా ఉంటుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఇరవై నాలుగేళ్ళ ఓ అబ్బాయి, అమ్మాయి కథ ఇది. చదువు, శారీరక ఆకర్షణ, లివిన్ రిలేషన్, బ్రేకప్, హ్యాపీ లేదా శాడ్ ఎండింగ్… ఈ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయి. అయితే కథను కన్ఫ్యూజ్ కాకుండా తెరపై ఎలా అవిష్కరించాం అన్నది చాలా ప్రధానం. కానీ దర్శకుడు తను రాసుకున్న సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కథగా చెప్పుకోవాలంటే ఇందులో ఏమీ లేదు. కొన్ని సీన్లు మాత్రం బాగా రాసుకున్నాడు. కెరీర్ పట్ల వాళ్లకు ఉండే కన్ఫ్యూజన్స్, ఫ్యూచర్ పట్ల ఉండే ఇన్సెక్యూరిటీస్, తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన లాయల్టీ వంటి అంశాలను సెన్సిబుల్‌గా, బోల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. కొంత మందికే నచ్చే సినిమా అవుతుంది.
