అమెరికాలో హెచ్-1బి వీసాపై గత ఏడాది విధించిన లక్ష డాలర్ల ఫీజు గడువును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 12 నెలల పాటు పొడిగించారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికా జాతీయ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. గతంలో అమలైన ఈ నిబంధన వల్ల పెద్ద ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీల నుంచి వచ్చే దరఖాస్తులు భారీగా తగ్గాయని వెల్లడించింది.
భారతీయులపై తీవ్ర ప్రభావం:
ఈ హెచ్-1బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉండటంతో, ఈ నిర్ణయం ప్రధానంగా మన దేశ నిపుణులపైనే తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, అమెరికాలోని విద్యా సంస్థల్లో స్టూడెంట్ వీసాలపై చదువుకుంటున్న వారికి , ఇప్పటికే అక్కడ ఉంటున్న వారికి ఈ నిబంధన వర్తించదని, కేవలం విదేశాల నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికే ఇది వర్తిస్తుందని స్పష్టమైంది. మరోవైపు, ఈ ఫీజు విధానంపై ఇప్పటికే ఫెడరల్ కోర్టుల్లో కొన్ని వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి.
మరింత కఠినతరమైన నిబంధనలు:
ఫీజు పొడిగింపుతో పాటు, వీసా దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతూ ట్రంప్ మరో ఉత్తర్వు జారీ చేశారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించిన చరిత్ర ఉన్న కంపెనీల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విదేశాంగ, కార్మిక, హోంలాండ్ భద్రతా శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనలను ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) స్వాగతించినప్పటికీ, ఇది అమెరికాలో నూతన ఆవిష్కరణలకు లేదా అత్యుత్తమ నైపుణ్యాల కొరతకు దారితీయకూడదని అభిప్రాయపడింది.
