అమెరికా నుంచి తమకు ఎటువంటి సందేశాలు లేదా ప్రతిపాదనలు అందలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మోహసీన్ నఖ్వీ టెహ్రాన్ పర్యటనకు వెళ్లిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. నఖ్వీ కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించేందుకే వచ్చారని ఇరాన్ పేర్కొంది.
ఖతార్ మధ్యవర్తిత్వంతో ఏడు షరతులు..
మరోవైపు, ఖతార్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకుని అమెరికాకు ఇరాన్ ఏడు ప్రధాన డిమాండ్లను పంపింది. ఒకవేళ ఈ డిమాండ్లను కనుక తిరస్కరిస్తే తాము నిర్ణయాత్మక యుద్ధానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి విడుదల చేయడం, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి ముఖ్యమైన అంశాలు ఈ డిమాండ్లలో ఉన్నాయని ఇరాన్ సుప్రీం నేషనల్ కౌన్సిల్ చీఫ్ మోహసీన్ రెజాయి వెల్లడించారు. ఖతార్ ద్వారా ఈ షరతులు ఇప్పటికే అమెరికా చేరాయని, ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ స్పందన కోసం తాము వేచి చూస్తున్నామని తెలిపారు.
హూతీల దాడితో ఉద్రిక్తత ..
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్‌లో తన వారాంతపు విడిదిని మధ్యలోనే రద్దు చేసుకుని హడావుడిగా శ్వేతసౌధానికి తిరిగి వచ్చారు. ఇరాన్ శాంతి చర్చల కోసం ఈ నిబంధనలు పెట్టిన తరుణంలోనే, యెమెన్‌లోని హూతీ రెబల్స్ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ వరుస పరిణామాల వల్ల అమెరికా సైతం ఇక్కడ పరిమిత స్థాయి సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
