టెక్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ దిగ్గజ సంస్థ గూగుల్ అంతరిక్షంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. భూమిపై కృత్రిమ మేధ డేటా కేంద్రాలకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ప్రయోగం..
గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ద్వారా అత్యధిక ఇంధన సామర్థ్యం, పనితీరు కలిగిన కృత్రిమ మేధ యాక్సిలరేటర్ చిప్ అయిన ట్రిలియన్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో పరీక్షించనున్నారు. రేడియోధార్మికత, తీవ్రమైన వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను తట్టుకుని సౌర విద్యుత్ ఆధారిత ఏఐ కంప్యూటింగ్ సదుపాయాలు అంతరిక్షంలో మనుగడ సాగించగలవా లేదా అని పరిశీలించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ ఏర్పాట్ల ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది.
సౌర విద్యుత్ ప్రయోజనాలు..
భూఉపరితలం నుంచి తక్కువ ఎత్తులోని కక్ష్యలో నిరంతరం సౌరశక్తిని పొందవచ్చని గూగుల్ చెబుతోంది. భూమిపై ఉత్పత్తి చేసే దానికంటే సుమారు ఎనిమిది రెట్లు అధిక పరిమాణంలో అంతరిక్షంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూమిపై ఏఐ డేటా కేంద్రాల ఏర్పాటుకు విద్యుత్ సరఫరా, స్థల కేటాయింపు, శీతలీకరణ వ్యవస్థల రూపకల్పన వంటి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ, అంతరిక్షంలో సౌరశక్తి ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేయడానికి గూగుల్ సిద్ధమవుతోంది.
