కాలిఫోర్నియా రాష్ట్రం చినో హిల్స్‌లో ఉన్న బాప్స్ (BAPS) శ్రీ స్వామినారాయణ మందిరంలో “బాప్స్ చారిటీస్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కాన్ఫరెన్స్ 2026 – వెస్ట్ రీజియన్” కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ విశేష సదస్సుకు శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ కే.జే. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాప్స్ సంస్థకు చెందిన డాక్టర్ జ్ఞానవత్సల్ దాస్ స్వామీజీ, వివేక్ మూర్తి స్వామీజీ, సర్వదర్శన్ స్వామీజీ, శాంత్ ముని స్వామీజీలతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వైభవంగా సాగిన జ్ఞాన, సేవా సమ్మేళనం..
స్వయంగా వైద్యుడైన కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీనివాస్, ఈ సదస్సులో పాల్గొన్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకులు, ఆవిష్కర్తలు , విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వైద్య విద్య, అభ్యాసం, ఆవిష్కరణలు, సేవా దృక్పథాల కలయికగా సాగిన వేళ, విజ్ఞాన మార్పిడి, విలువలతో కూడిన సేవ ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు.
భవిష్యత్ వైద్యాభివృద్ధికి పిలుపు..
ఆరోగ్య రంగ భవిష్యత్తును మరింత సుదృఢంగా తీర్చిదిద్దేందుకు కాన్సుల్ జనరల్ వైద్య రంగానికి నాలుగు ముఖ్యమైన సూత్రాలను నిర్దేశించారు.
క్లినికల్ ఎక్సలెన్స్ (వైద్య నైపుణ్యం): చికిత్సా విధానంలో అత్యుత్తమ ప్రమాణాలు, ఆవిష్కరణలను పాటించడం.
లీడర్షిప్ (నాయకత్వం): ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించే దిశగా నాయకత్వాన్ని పెంపొందించుకోవడం.
రెసిలియెన్స్ (స్థిరత్వం/సహనం): సవాళ్లను ఎదుర్కొంటూ నిలకడగా వైద్య సేవలను అందించడం.
సేవ (SEVA): నిస్వార్థ భావంతో, మానవీయ కోణంలో రోగులకు సేవలు అందించడం.
ఈ నాలుగు ప్రధాన అంశాల ప్రాతిపదికగా వైద్య విధానాలు మలచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డిజిటల్ హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతికతతో వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్తూనే, సేవా భావాన్ని విడవకూడదని సదస్సులో ప్రముఖులు స్పష్టం చేశారు.
