వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. రచయితగా త్రివిక్రమ్ పనిచేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. ఇక త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ క్రైమ్, డార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. వాయిదాల పర్వం తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో పరిశీలిద్దాం.
కథా నేపథ్యం
చిట్టిబాబు (వెంకటేశ్) ఓ సగటు మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి. ఆయన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారంలో నష్టపోయి అప్పులపాలు కావడం, చదువు అబ్బని కొడుకు సర్వ (ప్రజ్వల్), ఓ మెకానిక్‌తో ప్రేమలో పడిన కూతురు సంపూర్ణ (యువీనా).. ఇలా ఈ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటాడు చిట్టిబాబు. అయితే, అనుకోకుండా రాత్రికి రాత్రే రూ.100 కోట్ల లాటరీ తగలడంతో వారి తలరాత మారుతుంది. అద్దె ఇంటి కష్టాల నుంచి ఖరీదైన గెటెడ్ కమ్యూనిటీలోని హౌస్ నెం. 47 బంగ్లాకు మారతారు. అంతా సంతోషంగా ఉందనుకునే సమయంలో, అత్యంత కిరాతకమైన బిహార్ టార్జన్ దోపిడీ ముఠా దృష్టి వీరి కుటుంబంపై పడుతుంది.
అసలు ఆ గ్యాంగ్ నేపథ్యం ఏమిటి? చిట్టిబాబు కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి భార్యాపిల్లలను హీరో ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో దామోదర్ నాయుడు (నారా రోహిత్) అనే పోలీస్ అధికారికి తెలిసిన నిజాలేమిటి? టార్జన్ గ్యాంగ్‌ను పట్టుకోవాల్సిన పోలీసులు, చిట్టిబాబు ఫ్యామిలీ వెంటే ఎందుకు పడ్డారు? ఇందులో డీఎస్పీ బృహస్పతి (రావు రమేశ్), మాలతి (నివేదా పేతురాజ్), ప్రదీప్ సర్కార్ (నాజర్), చిత్తరంజన్ (సత్య) పాత్రల ప్రాముఖ్యత తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
కథనం, విశ్లేషణ
ఈ సినిమాకు ఇటీవల వచ్చిన ‘బ్లాస్ట్’ మూవీకి పోలికలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ, కేవలం విరామ ఘట్టంలో మినహా ఆ ఛాయలు ఎక్కడా కనిపించవు. ఫస్టాఫ్ అంతా దర్శకుడి మార్క్ వినోదం, వెంకటేష్ స్టైల్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చాలా సరదాగా గడిచిపోతుంది. బిహార్ గ్యాంగ్ క్రూరత్వాన్ని ఎలివేట్ చేస్తూ సినిమాను ప్రారంభించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆర్థిక కష్టాలు, పిల్లల సమస్యలతో సతమతమయ్యే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. లాటరీ గెలుచుకున్న తర్వాత బిహార్ ముఠా నెక్స్ట్ టార్గెట్ వీరేనని ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది. అయితే, వారు ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారనేది ఆసక్తికరంగా మలిచారు. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్లో సత్య పండించిన కామెడీ, ఎక్స్ప్రెషన్స్ హైలైట్‌గా నిలుస్తాయి.
కానీ, సెకండాఫ్‌లో దర్శకుడి మార్క్ మిస్సైంది. హీరో కుటుంబం వెనుక ఉన్న మరో కోణాన్ని రివీల్ చేస్తూ ఇచ్చిన ఫ్లాష్‌బ్యాక్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. పైగా ముఠాను పట్టుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ, హీరో కుటుంబాన్ని పావుగా వాడుకుంటూ పోలీసులు వేసిన స్కెచ్ సిల్లీగా అనిపిస్తుంది. సత్య కామెడీ కాస్త ఊరటనిచ్చినా, షాపింగ్ మాల్ ఫైట్ సాగదీసినట్లుగా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్, కుటుంబాన్ని రక్షించుకునే సీన్స్ అంతా రొటీన్ ఫార్మాట్లోనే సాగాయి.
నటీనటుల పనితీరు
చిట్టిబాబు పాత్రకు వెంకటేశ్ ప్రాణం పోశారు. తొలిభాగంలో ఫ్రస్ట్రేషన్‌తో కూడిన తండ్రిగా, మలిభాగంలో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా తనదైన కామెడీ టైమింగ్, యాక్షన్‌తో అదరగొట్టారు. భార్య స్వర్ణగా శ్రీనిధి శెట్టి వినోదంతో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించింది. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్‌గా హుందాగా నటించినా, ఆయన పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. పిల్లలుగా నటించిన యువీనా, ప్రజ్వల్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రావు రమేశ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది, ఆయన డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి. సత్య తెరపై కనిపించిన ప్రతిసారీ నవ్వించాడు. నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ, నాజర్, షఫీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే.. త్రివిక్రమ్ ఫస్టాఫ్‌ను అద్భుతంగా డీల్ చేసినా, సెకండాఫ్‌లో రైటింగ్‌లో తడబడ్డారు. “ప్రతి ఎక్స్ప్రెషన్ ముఖంపై కనిపించడానికి నేనేమైనా మోహన్‌లాలా.. కమల్హాసనా” అని వెంకీ చెప్పే డైలాగ్ పేలింది. తమన్ అందించిన బాణీల్లో ‘నారాయణమ్మ’ మినహా మిగతావి అంతగా రిజిస్టర్ కావు, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను ఎలివేట్ చేసింది. విజువల్స్, నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
బలాలు:
వెంకటేశ్, శ్రీనిధి శెట్టి యాక్టింగ్
ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్
ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ థ్రిల్
బలహీనతలు:
రొటీన్‌గా అనిపించే ప్లాట్
తేలిపోయిన ద్వితీయార్ధం
చివరగా: ఎంతో కొంత మెప్పిస్తుందిలే…!
