భారత్‌లో పెరుగుతున్న సాంకేతిక నిపుణుల సంఖ్య వల్ల, 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో ఏఐ సాంకేతికతలో అవకాశాలను మరింత బలోపేతం చేయడానికి భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. సీటెల్‌లో భారత్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా, భారత్ టెక్నాలజీ నిపుణులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత 35 ఏళ్లుగా సీటెల్ టెక్నాలజీ కమ్యూనిటీ సాధించిన అభివృద్ధి, భారత్‌లో ఉన్న సంబంధాలను సత్య నాదెళ్ల ప్రస్తావించారు. వివిధ దేశాలు, సమాజాలు, రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుందనే దానిపై ఆధారపడి ప్రయోజనాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, బోయింగ్, ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, ఇంటెల్, గేట్స్ ఫౌండేషన్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో పాటు 40 మందికి పైగా భారత సంతతి సీఈఓలు, సీటీఓలు ఈ ఫోరమ్‌కు హాజరయ్యారు.
అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ, భారత్-అమెరికా సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇరుదేశాల నిపుణులు చూపుతున్న ఆసక్తిని స్వాగతించారు. ఏఐ విషయంలో సంబంధిత భాగస్వాములతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
