వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ముప్పు నుంచి ప్రపంచానికి, ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఐక్యరాజ్యసమితిని కోరారు. ఏఐ టెక్నాలజీని సరైన పద్ధతిలో నియంత్రించలేకపోతే అది భవిష్యత్తులో మానవాళి మొత్తానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాధినేతల సమావేశాల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలిలో జరిగిన ప్రత్యేక భేటీలో ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ సీఈవోలు దారియో అమోడేయీ, శామ్ ఆల్ట్మన్లు ఈ కీలక విజ్ఞప్తి చేశారు.
టెక్ దిగ్గజాల సూచనలు..
ఏఐ శక్తిని కేవలం ఏదో ఒక దేశానికో లేదా ఒకే కంపెనీకో పరిమితం చేయకూడదని, ఈ టెక్నాలజీ ప్రయోజనాలు ప్రపంచమంతా అందేలా చూడాలని సూచించారు. ప్రజలు తమ దైనందిన జీవితాలను, సేవలను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడేలా తగిన నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏఐపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిని అడ్డుకోవడానికి దేశాలన్నీ కలిసికట్టుగా ఒకే రకమైన భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరారు.
రుమ్మన్ చౌధురి హెచ్చరికలు..
ఏఐ ద్వారా జీవాయుధాలు తయారవకుండా కఠినమైన నిబంధనలు విధించాలని ఆంథ్రోపిక్ చీఫ్ అమోడేయీ ప్రపంచ దేశాల నేతలకు పిలుపునిచ్చారు. ఏ మోడల్స్ వల్ల ప్రమాదం పొంచి ఉందో ముందుగానే గుర్తించేందుకు తగిన పరీక్షా విధానాలను ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు, కిల్లర్ రోబోల ఆలోచనలు కేవలం సైన్సు ఫిక్షన్ సినిమాల్లోని విలన్లను మాత్రమే తలపించేలా ఉన్నాయని, ఇవి కేవలం కల్పన కాకుండా వాస్తవ రూపంలో ముప్పుగా మారుతున్నాయని హ్యూమన్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకురాలు, డేటా సైంటిస్టు రుమ్మన్ చౌధురి ఆందోళన వ్యక్తం చేశారు.
