అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్లతో సైబర్ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన పలు కీలక వెబ్సైట్లలోకి ప్రవేశించి సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడైంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, సంబంధిత ప్రభుత్వ విభాగాలను వెంటనే అలర్ట్ చేసింది.
ప్రభుత్వ వెబ్సైట్లలో ఏఐ మోడళ్ల జోక్యం..
అమెరికా సెన్సస్ బ్యూరో (Census Bureau), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) తో పాటు పలు ఇతర ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తమ ఏఐ మోడళ్లు యాక్సెస్ చేసుకున్నట్లు ఓపెన్ఏఐ ధ్రువీకరించింది. ఏఐ బాట్లకు శిక్షణనిచ్చే క్రమంలో, వాటి సాంకేతిక సామర్థ్యాలను అంచనా వేసే సమయంలో ఈ సమాచార సేకరణ జరిగినట్లు తెలిపింది. అయితే, మోడళ్లు ఎక్కువగా రొటీన్ రీసెర్చ్ పనుల నిమిత్తమే పబ్లిక్ డేటాను పరిశీలించాయని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ ఆందోళనలు..
ఇదే కోవలో ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్సైట్లోకి కూడా ఓపెన్ఏఐ మోడల్ అనధికారికంగా ప్రవేశించిన విషయం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పందిస్తూ.. వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భంగం కలగలేదని తెలిపారు. ఇలాంటి సాంకేతిక లోపాలు, మోడళ్ల అడ్డూఅదుపు లేని ప్రవర్తనపై ఓపెన్ఏఐ ప్రస్తుతం విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
శామ్ ఆల్ట్మన్ స్పందన..
ఈ వరుస పరిణామాలపై ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఎక్స్ వేదికగా స్పందించారు. సమస్య పరిష్కారంలో ఆశించిన వేగంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని అంగీకరించారు. భారీ మొత్తంలో ఉన్న యాక్టివిటీ లాగ్లను పరిశీలించి, పారదర్శకతను పాటిస్తూనే ప్రభావిత సంస్థలతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన వనరులను పెంచుతున్నామని ఆయన తెలిపారు.
