రష్యా సరికొత్తగా ప్రయోగిస్తోన్న జెట్ ఇంజిన్ డ్రోన్లు ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థకు తీవ్ర సవాల్‌గా మారాయి. ‘గెరాన్-5’ (Geran-5) పేరుతో ఉన్న ఈ డ్రోన్లను రష్యా గత ఆగస్టు నుంచి యుద్ధంలో విస్తృతంగా ఉపయోగిస్తోంది. సాధారణ డ్రోన్లను 95 శాతం వరకు అడ్డుకోగలుగుతున్న తమ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఈ కొత్త జెట్ డ్రోన్లలో కేవలం 60 శాతం మాత్రమే కూల్చగలుగుతున్నాయని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
గెరాన్-5 డ్రోన్ల ప్రత్యేకతలు..
‘గెరాన్-5’ డ్రోన్ గంటకు 600 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు అలాగే 1,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం సులభంగా ఛేదించగలదు. ఇది సుమారు 6,000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలగడం వల్ల భూతల రక్షణ వ్యవస్థలకు వీటిని గుర్తించి కూల్చడం కష్టంగా మారుతోంది. ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ప్రత్యేకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించాల్సి వస్తోంది.
మారుతున్న యుద్ధ వ్యూహాలు..
2022లో యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరుపక్షాలు ప్రధానంగా యుద్ధ విమానాలనే ఉపయోగించగా, ఆ తర్వాత వాయురక్షణ వ్యవస్థల కారణంగా సుదూర దాడులకు ప్రాధాన్యం పెరిగింది. 2023లో రష్యా గ్లైడ్ బాంబులను విస్తృతంగా ఉపయోగించగా, క్రమంగా డ్రోన్లు కీలక ఆయుధాలుగా మారాయి. తొలినాళ్లలో నెమ్మదిగా ప్రయాణించే గెరాన్-1, గెరాన్-2 డ్రోన్లను వాడిన రష్యా.. 2025లో జెట్ ఇంజిన్‌తో గెరాన్-3, ఆ తర్వాత గెరాన్-4ను రంగంలోకి దించింది. ప్రస్తుతం మరింత వేగంతో దూసుకెళ్లే గెరాన్-5 డ్రోన్లను ఉపయోగిస్తుండగా, ఉక్రెయిన్ వద్ద క్షిపణుల నిల్వలు తగ్గుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
